Alibaba and Forty Thieves Second Story in Telugu Language : In this article we are providing " కాలం కలసివచ్చింది ఆలీబాబా 40 దొంగలు కథ ...
Alibaba and Forty Thieves Second Story in Telugu Language : In this article we are providing "కాలం కలసివచ్చింది ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
కాలం కలసివచ్చింది ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Second Story in Telugu
ఎప్పటిమాదిరే ఆలీబాబా గాడిదను వెంట తీసుకొని కట్టెలు కొట్టుకు వచ్చే నిమిత్తం దాపున వున్న అడవికి వెళ్ళాడు ఎంత వెతికినా ఎక్కడ చూసినా ఎండు కట్టెలు అనేవి కనిపించలేదు. తన దురదృష్టానికి తనే నవ్వుకున్నాడు. జాలిపడ్డాడు. ఆనాటికి కట్టెలు దొరికే అవకాశం లేదని తిరుగుమొహంపట్టి అడవిలో చాలా దూరం వెళ్ళాడు.
అదే సమయంలో యేవో గుర్రాలు పరిగెత్తుగొస్తున్న చప్పుడు విని, అక్కడనే వున్న పెద్ద చెట్టుచాటున నిలబడి అటే చూస్తున్నాడు. గుర్రాలు సమీపించాయి వాటి మీద మనుషులు భయంకరంగా కనిపించారు. అందరూ ఆయుధాలు ధరించి వున్నాడు. గుర్రాలు దగ్గరవుతున్న కొద్దీ ఆలీబాబా భయం ఎక్కువైంది. గాడిదను కొండగట్టుచాటున నిలబెట్టాడు. తను కొండకు కొంత దూరం పైకి వెళ్ళి అక్కడున్న దుబ్బలు చాటున దాగి కళ్ళు గుర్రాలపైనే వుంచాడు. వాళ్ళవద్ద ఎన్నెన్నో మూటలు కూడా వున్నాయి.
ఆలీబాబా నక్కిన కొండముందే వాళ్ళ గుర్రాలు ఆగిపోయాయి. వాళ్ళు తనను చూశారేమోనన్న భయంతో కొద్దిగా జంకుతూ అటే చూస్తున్నాడు ఆలీబాబా గుర్రాల మీద వచ్చిన వారు గుర్రాలు దిగి మూటలు భుజాన వేసుకున్నారు. కొండవైపు నడుస్తున్నారు. అది కొండగుహ. ఆ సంగతి అప్పటివరకూ పట్టించు కోలేదు ఆలీబాబా. తన దాగినచోటునుండి కొద్దిముందుకు వచ్చి చాటునుండి వాళ్ళనే చూస్తున్నాడు. “బీబీ బేగం రాస్తాచోడో” అన్నాడు వాళ్ళలో బలిష్టంగా ఎత్తుగా హుందాగా కనబడుతున్న వ్యక్తి ! అతని చూపులూ చేతలూ అధికారంలు బట్టి వాళ్ళకు నాయకుడు అనుకున్నాడు ఆలీబాబా. వాళ్ళు అనినమాట 'బీబీ బేగం రాస్తాచోడా' అని చిన్నగా గొణుక్కున్నాడు ఆలీబాబా.
గుహద్వారానికి అడ్డుగావున్న బండప్రక్కకు తప్పుకోవడం వాళ్ళు మూట లతో లోపలకి వెళ్ళి కొద్దిసేపు అయినాక వట్టి చేతులతో తిరిగి రావడం చూశాడు. ద్వారం తెరుచుకునేందుకు వాళ్ళు చేసినపని కళ్లప్పగించి చూస్తున్నాడు.
ఖాళీ మనుషులు లోపలనుండి వట్టి చేతులతో వచ్చారు బయటికి వచ్చి 'బీబీ బేగం రాస్తా బంద్' అని అరిచాడు అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళు దోపిడీ దొంగలు అని దోచుకువచ్చిన ధనంను ఆ గుహలో దాస్తున్నారనీ అనుకున్నాడు. లోపలకు వెళ్ళి చూడాలన్న ఆశపుట్టింది. వాళ్ళు దారివ్వడానికి మూయడానికి అన్నమాటలు గుర్తుంచుకున్నాడు ఆలీబాబా.
వాళ్ళు నలభైమంది దొంగలు. అందరూ కండలు పెంచుకొని భయంకరంగానే వున్నారు. మళ్ళీ గుర్రాలమీద ఎక్కి ఎటో వెళ్ళిపోయారు.
ఆలీబాబా కొండ పై భాగం నుండి తేరిపార చూశాడు. వాళ్ళు గుర్రాలు చాలాదూరం వెళ్ళాయి. అతనికి రవ్వంత ఆశ కలిగింది. కొండ దిగాడుగుహ ద్వారం వద్దకు వెళ్ళాడు. దొంగల నాయకుడు అన్నట్లు “బీబీ బేగం రాస్తాచోడో అని పెద్దగా మూడుసార్లు అన్నాడు. చేత్తో అడ్డుగా వున్న బండను తట్టాడు అంతే మార్గానికి అడ్డుగావున్న బండ తప్పుకొని దారి యేర్పర్చింది. దిక్కులు చూస్తూ ఆలీబాబా లోపలికి వెళ్ళాడు వేగంగా. గుహలో కొంత దూరం చీకటిగా వుంది. యెంతో శ్రమపడి ముందుకు నడుస్తున్నాడు. కొంతదూరం వెళ్ళేసరికి అక్కడ విశాలంగా కనిపించింది. అక్కడంతా వెలుగు వున్నట్లు కనిపించింది. దిక్కులు చూశాడు మరోనాలుగు అడుగులు వేశాడు. అతని కళ్ళను అతనే నమ్మలేకపోయాడు. ఆ గుహలో రత్నాలు,మణులు,వజ్రాలు,రకరకాలైన బంగారు వెండి నాణాలు గుట్టలుగా పోసివున్నాయి. యే దీపం వుందని ఆ గుహలో అంత కాంతి వుంది అంటే గుట్టలు పోసి వున్న రత్నాలు మణులు మొదలగు వాటి ప్రభావమే అనుకున్నాడు.
అదంతా దొంగలు కొల్లగొట్టుకు వచ్చిన ధనంకనక వింతగా చూశాడు ఆ వస్తువులు యెన్నోరకాలు 'అబ్బా యెంత ధనం ?” అని గొణుక్కున్నాడు.
అదృష్టం తనను వరించిందనుకొన్నాడు. తనని తన భార్య, తల్లి, పిల్లాడు సుఖంగా బ్రతికే అవకాశం వచ్చిందనుకొన్నాడు.
కొద్ది నిముషాలు ఆలోచిస్తూ దిక్కులు చూశాడు. అవతలగా ఖాలీ సంచులున్నాయ్. అందులో రెండు సంచులను తీసుకొని అక్కడ వున్న రత్నాలు వగైరాలతో నింపాడు. వెంటనే గుహ బయటికి వచ్చాడు ఆ సంచులతో. గుహ ద్వారం వద్ద నిలబడి 'బీబీ బేగం రాస్తా బంద్' అని మూడుసార్లు అరిచాడు.
గుహద్వారం మూసుకుపోయింది. ఆ సంచులను గాడిద మీద ఎక్కించాడు ఆనందంలో హుషారుగా కూనిరాగం తీసుకుంటూ సాయంత్రం దీపాలు పెట్టే వేళకు ఇల్లు చేరాడు.
గాడిద మీద వున్న సంచులను లోపల పడేశాడు. తలుపుల్ని మూశాడు. తను మోసుకువచ్చిన సంచుల్లోవి అక్కడ గుమ్మరించాడు 'అబ్బ యెంత ధనం, యెంత ధనం' అనుకుంటూ వాటిని చూస్తూ కూర్చుని యేదో ఆలోచిస్తున్నాడు ఆలీబాబా.
అతని కొడుకు ఏడుపు వినిపించింది. వుండరా యింక నీకు యే లోటు రాదురా 'బేటా' అని గొణిగాడు.
అదే సమయంలో అతని భార్య వంటపని ముగించుకొని ముందు గదిలోకి వచ్చింది.
ఆలీబాబా తల్లి వృద్ధురాలు కావడంతో అవతల గదిలో పడుకున్నది తనకేం పట్టనట్లు.
ఆలీబాబా భార్య ఆ ధనరాశుల్ని చూసి కొయ్యబారిపోయింది 'ఎంత ధనం, ఎంతధనం' అని గొణిగింది.
"ఏవండీ ఇదంతా మీకు ఎవరిచ్చారు ఎందుకిచ్చారు ?” అని అడిగింది.
“హుష్ గట్టిగా మాట్లాడకు మన అదృష్టంపండింది. అల్లాయే మనకు యిచ్చాడు” అన్నాడు.
“ఎక్కడినుండి తెచ్చారండీ” అంది నెంపాదిగా భర్తప్రక్కన కూర్చుని.
“అదంతా చెప్తానుకదా అయితే యీ రహస్యం మనలోనే వుండాలి బయటికి యేమాత్రం పొక్కకూడదు” అన్నాడు ఆలీబాబా.
“దొంగతనం చేశారా ? ” అంది చిన్నగా.
“దొంగతనమో దొరతనమో తర్వాత ! ముందు దీన్ని భద్రపర్చాలి ! అందు గురించి ఆలోచించు” అన్నాడు ఆలీబాబా.
“అది సరేనండి. యీ ధనం యెక్కడినుండి తెచ్చారో చెప్పండి' అంది మళ్ళీ. “ఓసి మొద్దూ! పెద్దగా అరవద్దు. యెవరికన్నా నీ మాటలు వినిపిస్తే చాలా ప్రమాదం. కొంపలు అంటుకుంటాయ్. యివ్వాల్టితో మనం దరిద్రం నుండి విముక్తుల మవుతాం. నేను మా అన్న కాశింభాయి కన్నా ధనంవంతుడిని! నువ్వు మా వదినకన్నా భాగ్యవంతురాలివి తెలుసా! అన్నాడు.”
“సరే ! ” ఆలీబాబా భార్య ఆనందించింది. కానీ ఆమెకు లోలోన భయం విడవకుండా పట్టుకుంది. తన భర్త ఎవర్నయినా చంపిగానీ, ఎక్కడయినా దొంగతనం చేసి గాని తెచ్చివుంటాడా? దొంగతనం చేయడం, ఎవర్నయినా చంపడం వంటి దురుద్దేశం ఆయనకు లేదు. అనుభవిస్తున్న దరిద్రం ఆ సమయంలో ఏదో ఒకటి చేయించి వుంటుంది. యేది యేమయినా తర్వాత చెప్తానన్నారు కదా వేచి చూద్దాం” అనుకుంది. .
“మీరు అబద్దం చెప్పొద్దు ! జరిగింది. జరిగినట్లు నిజమే చెప్పండి” అని అన్నది. ఆలీబాబా తన భార్యకున్న భయం, ఆందోళననీ అర్ధం చేసుకున్నాడు. చెప్పక తప్పదనిపించింది “జరిగింది జరిగినట్లే చెప్తాను విను” అన్నాడు. అతని కళ్ళు యేదో భయంతో దిక్కులు చూస్తున్నాయి.
అతని చూపుల్లో భయంను అర్థం చేసుకుంది భార్య. భర్తను ప్రశ్నార్థ కంగా చూసింది. “మేరీ ప్యారీ బీబీ! నేను యేం చేసినా నీకు చెప్పకుండా వేరేవరికి చెప్తాను? చెప్తున్నాను విను. అంటూ ప్రారంభించాడు” అడవిలో జరిగిందంతా అక్షరం! విడవకుండా భార్యకు తెలియపర్చాడు.
అతని భార్య కళ్ళప్పగించి చూస్తూ యేదో ఆలోచిస్తున్నది.
నువ్వు యీ సంగతి పెదవి దాటి బయటికి రానీయకు, వచ్చిందా ప్రమాదం సంభవించుతుంది. ఎదుటివారు బాగుపడుతుంటే చూడలేని మనుషులు వుంటారు. అంతేగాదు మా అన్నకు వదినకు అసలే తెలియనివ్వకు మనం అంటే వాళ్ళకి అసలే గిట్టదు కదా ! మనం కలిగినవాళ్ళమయితే అది చూసి మా వదిన మరీ ఓర్వలేదు. పైగా 'ఆడదాని నోట్లో నువ్వు గింజంతయినా మాట దాగదని' సామెత వుండనే వుంది. ఇది యేమాత్రం యితరులకు తెలిసినా మనకు ప్రమాదం. ఆ దొంగలకు తెలుస్తుంది. వాళ్ళు అంతా మన ఇంటి మీదకు వచ్చి పడతారు. మనల్ని చంపేస్తారు. యేది యెలావున్నా తెలిసో తెలియకో దరిద్రం వెన్ను పట్టి పీడించడం వలనో ఇలాచేశాను. యీ రహస్యం మనలోనే వుండాలి ! పెదవి దాటితే ప్రమాదం” అని అన్నాడు.
విషయం తెలిసిందిగా యెవ్వరికీ చెప్పనని ఆలీబాబా భార్య మాట యిచ్చింది.
తదుపరి తెచ్చిన బంగారు నాళాలను ఆలీబాబా లెక్కపెట్టడం మొదలుపెట్టాడు లెక్కపెట్టలేకపోయాడు చేతులు నొప్పిపుడుతున్నాయి కానీ లెక్క తెమలటం లేదు. నాణాలు తరగడం లేదు.
“తెల్లారితే నలుగురూ తిరిగే సమయం వస్తున్నది. యెవరి కంటయినా పడితే ప్రమాదం అని ముందే చెప్పారు కదా ఈ ధనాన్ని ఎక్కడయినా దాచడం మంచిది” అంది అతని భార్య.
“ఎక్కడ దాస్తాం ” అని ఆలోచిస్తున్నాడు. అతనికేదో ఉపాయం తట్టింది. “ ఆ! మన ఇంట్లోనే గొయ్యి తీసి అందులో దాద్దాం అవసరాన్ని బట్టి అవసరమైన ధనంను తీసుకుంటుందాం” తిరిగి అన్నాడు ఆలీబాబా.
ఆలీబాబా భార్య ఆలోచనలో పడింది. 'కాలం కలిసివస్తే నడిచివచ్చే బిడ్డపుడతాడని' శాస్త్రం వుంది. భార్యకు ఒక ఆలోచన తట్టినది. .
“ఏదయినా లెక్క అవసరం. ఆ లెక్క మనకు అయినా తెలియాలి కదా అల్లా దయంటూ మనకు అనుకోకుండా ధనం దక్కింది. అది ఎంత వుందో మనకు అయినా తెలియాలి కదా! మనమా లెక్కపెట్టలేము కదా ! యీ నాణాలను కుంచంతో కొలుద్దాం. వెంటనే లెక్క తెల్చుకొని అనంతరం భూమిలో పాతి పెడదాం ” అని అన్నది.
ఆలీబాబా భార్య ఆలోచన నచ్చింది. “అయితే మనకు కుంచం ఎక్కడిది” ఎవర్ని అడుగుతాం యెందుకంటే యే సమాధానం చెప్తాం ? అని ఆలోచించు కుంటూ, మనకు కుంచం లేదుకదా” అని అన్నాడు.
భార్య ఆలోచిస్తున్నది.
మన ఇంట్లో యింతవరకూ కుంచంతో కొలవగలిగిన ధాన్యం రాలేదు. అది మన యింట్లో లేదు “కుంచంను ఎక్కడ తెద్దాం” ప్రశ్నార్థకంగా చూశాడు.
“మీరు కంగారు పండకండి నేను మీరు అనుకున్నంత వెర్రిదానను కాదు ఇరుగుపొరుగు ఇళ్ళకు వెళ్ళి కుంచం అడుగుతాను. యీ విషయం మాత్రం పెదవి దాటించి ఎవ్వరితోను అనను సరా” అన్నది.
“కుంచంతో ఏం పనని వాళ్ళు అనుమానిస్తే అన్నాడు.
" యేదో కారణంతోచకుండా వుంటుందా? అది చెప్తాను” అన్నది ఆమె.
“మనకు కుంచం అవసరం అందుకని మా అన్న ఇంటికి వెళ్ళి పట్టుకొస్తే” అన్నాడు ఆలీబాబా.
“ఆప్రశ్న వాళ్ళూ వేస్తారు గదా” అన్నది అతని భార్య.
“మా అన్న మనవాడేకదా! యేదో చెప్పి అవసరానికి పట్టుకురావచ్చును” “యిలా చేస్తే బయటివాళ్ళకి తెలిసే అవకాశం వుండదుకదా. యెవ్వరికీ అనుమానమూ రాదు” అన్నాడు ఆలీబాబా. .
“వాళ్ళు మనతో మాట్లడరు మనం అంటే గిట్టదు. అందులో మీ వదిన చాలా ఘటికురాలు” అన్నది. భార్య.
“మనతో మాట్లాడకపోతేనేం ? మనం వెళోదు. మా అమ్మ వుందిగా. అన్నదమ్ములు యిద్దరికీ కావలసింది. దాన్ని పంపుదాం. మన రహస్యం మా అమ్మకే తెలియదు. అందుకని మా అమ్మ తెస్తుంది. అదీగాక మా అమ్మ అప్పుడప్పుడు కడుపు తీపితో వాళ్ళ ఇంటికి వెడుతూంటుంది కదా” అన్నాడు ఆలీబాబా.
“ నా ఆలోచన బాగుంది !” అన్నది ఆలీబాబా భార్య.
ఆ వెంటనే తల్లి దగ్గరకు వెళ్ళి అసలు విషయం చెప్పకుండా కుంచం పట్టుకురమ్మన్నాడు ఆలీబాబా. .
ఏమిటి, ఎందుకు అని అడక్కుండా అంగీకరించింది ఆలీబాబా తల్లి.
ఆలీబాబా తల్లి అప్పుడప్పుడు వెళ్ళి పెద్దకొడుకు కాశింను, ఆయన భార్యనూ చూసి వస్తుంది. కానీ వాళ్ళు ఇంట్లో వుండమనరు వాళ్ళు వుండదు.
COMMENTS